Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page

కర్మ మార్గము

ఎన్నో విధములైన కర్మానుష్ఠానములను గూర్చి అప్పుడప్పుడు నేను చెప్పుతుంటాను. ఇవన్నీ మనం ఇతరులకోసం చేస్తున్నట్లు కనిపించిననూ అవన్నీ మన క్షేమంకోసమే. ఒకరికి ఉపకారమో, సేవయో చేసినపుడు మన హృదయంలో ఒక విధమైన తృప్తీ, పరిపూర్ణత ఏర్పడుతున్నది. మన సేవవల్ల ఇతరులకు లాభమున్ననూ లేకపోయిననూ మనకు ఒక కృత కృత్యతానుభవం - పరిపూర్ణభావమూ కలుగుతున్నది. దీనిని మనము పరోపకార మని అనుకొన్ననూ, మనకు నిజంగా ఇది ఉపకారంలాగానే వుంటుంది.

మనం ఈశ్వరారాధన చేస్తున్నాం. పరమేశ్వరునకు కావలసిన దేమీలేదు. కాని మంత్రజపమో పారాయణమోక్షేత్రాటనమో- ఏదో ఒకటి చేసినపుడు మన హృదయాలలో ఆనందస్ఫురణ అనుభవగోచరమవుతున్నది. ఈ కార్యములన్నీ మనకు మనయందుగల ప్రీతిని ఉద్దేశించే చేస్తున్నాము. భార్యయందు కాని పిల్లలయందు కాని, ఇతరులయందు కాని మనము ప్రీతిని ఉంచటము, మనయందు మనకుగల ప్రీతికారణము వలననే. ఈ ప్రీతికి కారణము ఆత్మయందు మనకుగల ప్రీతి యని ఉపనిషత్తులో యాజ్ఞ్యవల్క్యమహరి బోధిస్తున్నాడు. భగవద్భక్తి, సామూహికసేవ, ఆత్మసంతోషము కొఱకై మనం చేస్తున్నాము. దీనికోసమే శరీర క్లేశము అనుభవిస్తున్నాము. ఎంతటి త్యాగమునకైనా మనము వెనుదీయటం లేదు.

మనం ఆర్జించే ద్రవ్యం మన ఇంద్రియ భోగములకు ఖర్చు పెట్టినపుడు ఇట్టి ఆనందముకాని తుష్టికాని మనకు కలగటంలేదు. పోగా అశాంతికి దారితీస్తున్నది. అద్దంలో మన ముఖం మనకు కనబడుతుంది. మన ముఖంలో తిలకం ఉండవలెనంటే, అద్దంలో కనబడే బింబమునకు పెట్టితే అద్దం మసి కావటం తప్ప వేరే ప్రయోజన ముండదు. స్వార్థమైన కార్యములు చేయటంకూడా మన యోగానికి మసిపూసినట్లే ఔతుంది. దానివలన ఆత్మసంతుష్టి కలగదు.

మనస్సు అనే మాయాదర్పణంలో ప్రతిబింబించే పరమాత్మ బింబమునుచూచి 'మనం' అని భ్రమిస్తున్నాం. ఆబింబమునకు మనం అలంకారం చేయవలెనంటే, పరమాత్మకు అలంకారం చేయాలి. పరమాత్మ స్వరూపమే ఈ విశ్వం ఈ జగత్తు. దీనికి మనం చేసేసేవ, పరమాత్మయొక్క సేవయే. దాని వలననే మనకు కృతార్థత, పరిపూర్ణత కలుగుతుంది. అమ్మవారికి మనం చేసే అలంకారం వలననే, మనకు ఆనందం. మనకు మనం చేసుకొనే అలంకారం, అహంకారమే! ఈ విషయం అందరూ గ్రహించలేకున్నారు. మనం జగత్తుకు చేసేసేవ, జగదీశ్వరి సేవయే.

మీరు లెక్కలేనన్ని పూలమాలలు తెచ్చి నాకు సమర్పిస్తున్నారు. మీకంటే నేను చాలా అధికుణ్ణి అని మీ భావం. మీ భక్తిని ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అర్పిస్తేనే కాని అలంకారం కాదు అని మీ ఉద్దేశం. ఈ మాలలన్నీ ధరించి నేను 'చాలా పెద్దమనిషి'ని అని నేను అనుకొంటే అది అహంకారమే. మీరు భక్తితో తెచ్చి ఇస్తున్నారు కనుక వానిని తిరస్కరించలేను. నన్ను అలంకరించి ఆనందిస్తుంటే, నేను ఈ మాలలను అమ్మవారికి అర్పించి ఆనందిస్తున్నాను.

అందుచేత వ్యక్తిగతంగా మనం సుఖంకోసం డబ్బును ఖర్చుచేయటం మన ముఖాలకు మసి పూసుకోవడమే. ప్రపంచంలోని ప్రజలకోసం చేసేసేవ, పరమేశ్వరారాధన ఔతుంది. దానివలన ఆత్మతుష్టి ఏర్పడుతుంది. ఇతరులకోసం పాటుపడే టపుడు కలిగే క్లేశం, దుఃఖం, ఆనందమూ, సుఖమూ ఇస్తున్నది.

ప్రపంచం పరమాత్మ స్వరూపమైతే, మనమూ పరమాత్మలమే. మనస్సు అనే అద్దాన్ని నిరాకరిస్తే, ఆ పరమాత్మ స్వరూపమే మనం అన్న జ్ఞానం అనుభవంలోనికి వస్తుంది. అదే ధ్యానం. మనంచేసే కర్మలన్నీ, ఈజ్ఞానస్థితిలోనికి పోయేటట్లుచేసి, నైష్కర్మ్యస్థితిలో అంతంకావాలి. నేను చెప్పే అనుష్ఠానముల పర్యవసానం ఆ ధ్యానస్థితియే.

ఎన్ని కార్యములు మనం చేసినా, అవి మనకు తాత్కాలికంగా సుఖం కలిగించినా సుషుప్తిలో మనకు కలిగే శాంతిని మాత్రం కలిగించ లేకుండా వున్నవి. ఒక్కరోజు నిద్రపోకపోతే ఎంత బాధగా ఉంటుంది? నిద్రలో అంతసుఖం ఉన్నదన్నమాట. అందుచేత ఏ కార్యమూ చేయకుండా ఊరక కూర్చోవటమే పరమ సౌఖ్యమని తేలుతున్నది. అట్లు ఏ కార్యమూలేక మన ఉనికిలో, పరమాత్మ స్వరూపములో అణగి ఉండటమే ధ్యానం.

నిద్రపోయే టపుడు మనకు సుఖంగా ఉన్నామన్న విషయంకూడ గుర్తుకురాదు. నిద్రనుంచి మేల్కొన్నపిదప ఆ సుఖవిషయమైన బోధ ఏర్పడుతున్నది. అట్లాకాక, 'పరమాత్మ స్వరూపముగా నేను ఉన్నాను' అన్న ప్రజ్ఞతో, శాంతితో ఉండటమే ధ్యానయోగములో చరమస్థితి - అదే సమాధి. ఇట్లు ఆంతర్యమున ఏ కార్యమూ లేనట్లు మనకు అలవాటైపోతే బయట ఎన్ని పనులు చేసినా మన శాంతికి భంగం అంటూ వుండదు.

దక్షిణామూర్తి శాంతస్థితి పూర్ణప్రజ్ఞతోడి ఆనందస్థితి. అది సుషుప్తిలో మనస్సు అణగిన స్థితి వంటిది కాదు. సుషుప్తిలో మన మనస్సు మన స్వాధీనంలో లేదు. అది తానుగా అణగిపోతుంది. నిద్రనుండి లేచినపుడుకూడా, మన ప్రమేయం లేకుండానే తానుగా మరల వస్తుంది.

చావుకూడ ఒక విధమైన నిద్రయే. చావులోనూ మనస్సు అణుగుతున్నది. కాని ఇంకొక పుట్టుకలో అదే మనస్సు తన పనిని మరల ప్రారంభిస్తున్నది. అందుచేత ఈ మనస్సు అణగటం అనే క్రియ మన స్వాధీనంలోనికి రావాలి. అప్పుడు కాని మనమనస్సు మనమాటవినదు. దక్షిణామూర్తి ఏకార్యమూలేక పూర్ణప్రజ్ఞతో ఉన్నాడు. లోపల ఏ కార్యమూ లేని దానివలన బయట అన్ని కార్యములు చేయుటకూసమర్థుడుగా నున్నాడు. ఏకార్యమూ లేకుండా వటవృక్షము క్రింద కూర్చున్న దక్షిణామూర్తి ఆనంద తాండవమూర్తిగా, త్రిపురసంహారమూర్తిగా, భిక్షాటన మూర్తిగా విలపిస్తున్నాడు. భక్తులకు వరప్రదానం చేస్తున్నాడు. ఏమి చేస్తున్నా హృదయంలో ప్రశాంతత ! అన్ని ఆర్భాటాలూ బయటనే. లోపల ప్రశాంతి. ఈ స్థితి మనకు కలిగినదంటే ఎంతటి కార్య రంగంలోకైనా మనమూ దూక వచ్చును.

కాని మనం ఉండే స్థితి ఆయన స్థితికి వ్యతిరేకం. బయట శాంతంగా మనం వున్నట్లు కనిపించిననూ, లోపల ఎక్కడలేని అలజడీ, ఆశాంతే. మొదట బాహిర శాంతిని మనం సాధించ కలిగితే, తర్వాత అంతరశాంతి క్రమంగా సిద్ధిస్తుంది.

'ఇంద్రియ వ్యాపారాలనుతగ్గించుకొని, ఏకాంతమును అలపరచుకో. పరోపకారం తప్పించి ఇతర కార్యములలో పాల్గొనవద్దు. ధనాశను వదలుకొని అరణ్యమునకు పో' అని పెద్దలు ఉపదేశం చేశారు. ఇట్లు దానినివదలు, దీనినివదలు- అని మనకు పరమ ప్రీతికరంగా వుండే విషయాలను త్యాగం చేయమంటే మనం అంతసులభంగా చేస్తామా? ఆ మాటలను వింటామా? చిత్తశుద్ధి ఏర్పడితేకాని, ఈ బోధలు మనకు రుచించవు. ఈ ఉపదేశమును అమలులో పెట్టడానికి వలసిన పరిపక్వత రాదు.

అందుచేత, 'దానిని వదలు, దీనిని వదలు' అని చెప్పడానికి బదులుగా- 'దీనిని చేయి, దానిని చేయి' అని నానావిధములైన కర్మలను విధులను, నిర్దేశించారు. కార్యమును చేసే ప్రవృత్తి మనకు సహజంగానే వున్నది. అందుచేత శాస్త్రవిహితమైన కర్మలను రాగద్వేషరహితంగా చేయుటకు పూనుకొంటున్నాము. కాని కార్యమని తలపెట్టితే అందులో ఇచ్ఛాద్వేషములు పొడసూపుతూనే వుంటవి. అందుచేత మొదటనే ధ్యానమని ప్రారంభించకుండా కర్మానుష్ఠానములను చేస్తూవచ్చినామంటే, భగవత్కృపవలన ఇష్టానిష్టములు తొలగి సత్కర్మలను సరియైన విధానంలో చేయగలుగుతున్నాము. ఇచ్ఛాద్వేషములు తగ్గుటవలన చిత్తశుద్ధి ఏర్పడుతున్నది. చిత్తశుద్ధి కలిగిన పిదప ధ్యాన వ్యగ్రతకు వలసిన ఏకాగ్రత మనకు లభిస్తున్నది.

అట్టి స్థితిలో మనం అడవికి వెళ్ళి ముక్కు పట్టుకొని కూర్చోవలసిన ఆవశ్యకత ఉండదు. సర్వమూ పరమాత్మ స్వరూపమే అన్న జ్ఞానం కలుగుతుంది. ఊరూ, అడవీ, ఏకాంతమూ, జనసందడి- అన్నీ పరమాత్మ స్వరూపంగానే అనుభవానికి వస్తుంది. కార్యమూ పరమాత్మయే. ధ్యానమూ పరమాత్మయే. ఏపనిచేసినా, మన ఆత్మ శాంతికి భంగము లేదు. దక్షిణామూర్తివలె మనమూ శాంతముగా ఆనందముగా ఉండిపోవచ్చు.

గీతలో భగవంతుడు అర్జునుడికి స్వధర్మ పరిపాలన చేయమని బోధిస్తున్నాడు. అనగా యుద్ధం చేయమంటున్నాడు. ఏకార్యమూ చేయకుండాధ్యానం చేయమనీ చెప్పినాడు. ''ఎల్లకాలమూ ధ్యాననిష్ఠలో వుంటున్న జనకాది రాజరులు లోకక్షేమార్థము ఎప్పడూ కర్మచేస్తూనే వచ్చారు. నేనూ వారివలె నిష్కామకర్మ చేస్తున్నాను'' అనిపైగా అర్జునుడితో అంటున్నాడు. ఇవన్నీ పరస్పర విరుద్ధములుగా లేవా? అంటే ఒకదాని నుండి మరొకటి ఏర్పడుతున్నది. మొట్టమొదటనే ఆత్మానుసంధానం చేయలేము. కనుక కర్మానుష్ఠానం. దాని మూలకంగా చిత్తశుద్ధి - చిత్తశుద్ధి ఏర్పడిన పిదప నిష్కామ కర్మ-నిష్కామ కర్మద్వారా ధ్యానం చేయాలని భగవంతుని బోధ- దీనిలో సిద్ధి ఏర్పడిన పిదప మనలను ఏదీ బాధించదు. లోక క్షేమంకోసం బయట కర్మ జరుగుతూ వుంటుంది; లోపల ఎక్కడాలేని ప్రశాంతి.

చివరకు, లోకమంతా మాయ. పరమాత్మ ఒక్కటే సత్యము- అన్న బోధ కలుగుతుంది, మనంవేరు, పరమాత్మవేరు; కార్యంవేరు 'నేను కర్తను' - వేరు - అన్న ఆలోచనలు లేకుండా అద్వైతంగా బ్రహ్మగా ఉండవలెననే భగవత్పాదులవారి సిద్ధాంతం. ఆయన పేరును పెట్టుకొన్న నేనూ, ఎప్పడూ వైదికకర్మలు, పూజ, జపం, పరోపకారం - ఇవన్నీ చేయమని చెప్పటం ఎందుకనగా మనం ఉన్న స్థితిలో ఇక్కడనుంచి ప్రారంభిస్తేకాని, మనకు ధ్యాననిష్ఠకు వలసిన చిత్తైకాగ్రత కుదరదుకనుక, ఇట్లు ఆరంభించిచేస్తూ వచ్చినామంటే, ఈ కర్మలు సోపానములవలె సాయపడి అద్వైత శిఖరానికి మనలను అందరినీ తీసుకొని వెళ్ళగలవు. శ్రీకృష్ణపరమాత్మ, శంకర భగవత్పాదులు సూచించిన మార్గమూ ఇదే. మొదట కర్మ పిదప ఉపాసన అనగా భక్తి, చివర జ్ఞానము.

ఇట్లు క్రమముగా శ్రద్ధతో భక్తితో విశ్వాసంతో విహిత కర్మలనుచేస్తూ వచ్చినామంటే - దానికి తగిన పక్వత కలిగి ఆత్మధ్యానమునకు అలవాటుపడి కర్మలలో ప్రవృత్తుల మైనప్పటికీ, చిత్తము చెదరనిస్థితి మనకు ఏర్పడుతుంది. అలజడి అన్నమాటలేక, 'మందస్మితం స్ఫురిత ముగ్ధ ముఖారవిందం' అని ఆచార్యపాదులు వర్ణించిన దక్షిణామూర్తిని- ఆనందమూర్తిని- మనం ప్రతిరోజూ స్మరిస్తూ వచ్చినామంటే ఆత్మధ్యానస్థితికి సులభంగా వెళ్ళగలం.

కర్మ, భక్తి, ధ్యానము- పరస్పర విరుద్ధములకావు; పరస్పర సాహాయ్యకములే (ఈుపూ|ప|nషశసా) కర్మాను ష్ఠానములన్నీ - ధ్యానసమాధిలో లయం కావలసినవే. ఆ స్థితి ఒకటి ఉన్నదని మనం ఆరంభంనుంచీ జ్ఞప్తిలో ఉంచుకోవాలి. మన లక్ష్యమూ అదేకదా! ప్రతిరోజూ కొంత కాలమైనా ధ్యానానికి నిర్దేశించి, ఏపనీచేయక శాంతంగా, ఒక నిర్దిష్ట కాలంలో, నిర్దిష్ట ప్రదేశంలో కూర్చుండి ధ్యాన మభ్యసించవలసినవిధి మనకున్నది. ధ్యానం చేస్తున్నాముకదా కర్మానుష్ఠానములో ఏమున్నది? ఇవన్నీ అర్థరహితమైన క్రియాకలాపమని మనం అనుకోరాదు. షnశ శస| ప|శnnగ|n అని ఈసడించుకోరాదు. కర్మానుష్ఠానం మనం విధిగా చేయవలసినదే. దానిచేత చిత్తమాలిన్యం తొలగిపోతుంది. అపుడు హృదయంలో - జ్యోతీరూప శివదర్శనమై - దక్షిణామూర్తి యొక్క ఆనందావిర్భావం- అనుభవ మౌతుంది.


Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page